రాజ్యసభ సమావేశాలు పొడిగింపుపై ఆందోళన దేనికి?

రాజ్యసభలో ఈబీసీ తదితర బిల్లులపై చర్చించి ఆమోదం పొందేందుకు వీలుగా రాజ్యసభ శీతకాల సమావేశాలు పొడగించబడ్డాయి. రాజ్యసభ సమావేశాలను పొడిగించాలని బీఏసీ సమావేశంలోనే నిర్ణయించారు కానీ ఈబీసీ బిల్లు కోసమే పొడిగించాలనుకొంటున్నట్లు మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలకు తెలియనీయలేదు. త్వరలో జరుగబోయే పార్లమెంటు ఎన్నికలలో ఈబీసీ బిల్లును ప్రతిపక్షాలపైకి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపైకి బ్రహ్మాస్త్రంగా సందించాలని ప్రధాని మోడీ భావిస్తున్న కారణంగా చివరి నిమిషం వరకు ఆ బిల్లు గురించి మంత్రివర్గంలో మంత్రులకు కూడా తెలియకుండా రహస్యంగా ఉంచారు. 

ఆ బిల్లును వ్యతిరేకిస్తే దేశంలో అగ్రవర్ణాల ఆగ్రహానికి గురై వారి ఓటు బ్యాంకును కోల్పోయే ప్రమాదం ఉంది కనుక లోక్‌సభలో ప్రతిపక్షాలకు దానిని వ్యతిరేకించలేని పరిస్థితి ఏర్పడి తప్పనిసరిగా బిల్లుకు అనుకూలంగా ఓటు వేయవలసి వచ్చింది. తమను ఈవిధంగా ఇరకాటంలో పెట్టి కీలకమైన ఈబీసీ బిల్లును లోక్‌సభలో ఆమోదింపజేసుకున్నందుకు ప్రతిపక్ష సభ్యులు మోడీ ప్రభుత్వంపై రగిలిపోతున్నారు. కానీ ఆ మాట పైకి చెప్పలేక తమకు మాట మాత్రంగానైనా చెప్పకుండా రాజ్యసభ సమావేశాలను పొడిగించిందని ఆరోపిస్తూ రాజ్యసభలో ఆందోళన చేస్తున్నారు. అయితే రాజ్యసభ సమావేశాలను పొడిగించాలని బీఏసీ సమావేశంలోనే నిర్ణయించామని, ఆ సమావేశానికి ప్రతిపక్ష సభ్యులు హాజరుకాకపోవడం వలననే వారికి ఈ విషయం తెలియలేదని, కనుక సభలో ఆందోళన చేయడం తగదని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ హెచ్చరించారు.