ఈబిసి బిల్లుపై మందకృష్ణ, కృష్ణయ్య స్పందన

దేశంలో ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును నిన్న లోక్‌సభ ఆమోదించడంపై ఎం.ఆర్పీ.ఎస్.అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, బీసీసంఘాల అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య భిన్నంగా స్పందించారు.  

 మందకృష్ణ మాదిగ స్పందిస్తూ, “అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం సహజం. కానీ అంతమాత్రన్న కేంద్రప్రభుత్వం దీనిని హడావుడిగా తెచ్చిందని చెప్పలేము. ఆర్ధికంగా వెనుకబడినవారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మేము ఎప్పటి నుంచో కోరుతున్నాము. కనుక దీనిని మేము స్వాగతిస్తున్నాము. దృడమైన రాజకీయ సంకల్పం ఉన్నట్లయితే ఏ బిల్లునైనా కేవలం 24 గంటలలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేయవచ్చునని మోడీ ప్రభుత్వం నిరూపించి చూపింది. కానీ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అన్ని పార్టీలు కలిసి గత 24 ఏళ్ళుగా పెండింగులో పెట్టేయి. ఇకనైనా దానికి మోక్షం కల్పించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలి,” అని అన్నారు.        

ఆర్.కృష్ణయ్య స్పందిస్తూ, “అగ్రవర్ణాలలో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. రిజర్వేషన్లు అనేవి పేదరిక నిర్మూలన పధకం కాదు. సమాజంలో వెనుకబడిన వర్గాల ప్రజల సామాజికహోదా పెంచేందుకే నిర్దేశించబడిన రిజర్వేషన్లను అన్ని రాజకీయపార్టీలు కలిసి ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఉపయోగించుకొంటున్నాయి. గత ఏడు దశాబ్ధాలుగా దేశంలో 80 శాతం పదవులను, అధికారాన్ని అగ్రవర్ణాలే అనుభవిస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు వారికే మరో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం చాలా దారుణం. అగ్రవర్ణాలలో పేదలకు సాయపడాలనుకుంటే ప్రభుత్వం వారికి ఆర్ధిక సహాయం, రుణాలు, రాయితీలు, స్వయం ఉపాధి పధకాలు వగైరా అందిస్తే సరిపోతుంది. ఈ బిల్లును తక్షణం వెనక్కు తీసుకోవాలని కోరుతున్నాము,” అని అన్నారు.