ఈబీసీ బిల్లుపై ప్రముఖుల స్పందన

అగ్రవర్ణాల పేదలకు విద్యా ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లును కేంద్రప్రభుత్వం ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టడంతో దానిపై ఏవిధంగా వ్యవహరించాలో సిఎం కేసీఆర్‌, తమ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తమ ప్రభుత్వం ముస్లింలకు12%, ఎస్టీలకు 10% రిజర్వేషన్లు కల్పించడానికి చేసిన ప్రతిపాదనను కూడా ఆ బిల్లులో చేర్చవలసిందిగా పార్లమెంటులో పట్టుబట్టాలని ఆదేశించారు. వాటి గురించి కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి ఇదే తగిన సమయమని సిఎం కేసీఆర్‌ సూచించారు. 

ఆర్.కృష్ణయ్య ఈ బిల్లుపై స్పందిస్తూ, “అగ్రవర్ణాలలో పేదలున్న మాట వాస్తవం. అయితే వారికి ప్రత్యేకంగా విద్యాఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించేబదులు వారు ఆర్ధికంగా నిలద్రొక్కుకోవడానికి ఉపాది అవకాశాలు కల్పించండి. అవసరమైతే ఆర్ధికసహాయం అందించండి. అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని మేము వ్యతిరేకించడం లేదు. కానీ జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించమని కోరితే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. లోపభూయిష్టంగా మారిన ఈ రిజర్వేషన్ల విధానాలను సరిచేసి బడుగు బలహీనవర్గాలకు న్యాయం చేయమని కోరుతున్నాను,” అని అన్నారు. 

బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి స్పందిస్తూ, “మేము అధికారంలోకి వస్తే అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి ఉన్నాము కనుక   కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము. అయితే గత నాలుగున్నరేళ్ళ బట్టి ఈ ఆలోచన చేయని మోడీ సర్కార్ సార్వత్రిక ఎన్నికలకు ముందు హడావుడిగా ప్రవేశపెట్టినందున దాని చిత్తశుద్ధిని శంఖించవలసి వస్తోంది,” అని అన్నారు.