ఆల్ రోడ్స్ లీడ్ టూ టీఆర్‌ఎస్‌!

తెలంగాణ రాష్ట్రంలో అన్ని దారులు తెరాసవైపే సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికలు ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే ఖమ్మం జిల్లాలోని వైరా నుంచి గెలిచిన స్వతంత్ర అభ్యర్ధి లావుడ్య రాములు నాయక్ తెరాసలో చేరిపోయారు. తెరాస తిరుగుబాటు అభ్యర్ధిగా రామంగుండం నుంచి పోటీ చేసి గెలిచిన కోరుకంటి చందర్‌ కూడా సోమవారం తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరిపోయారు. ఇంకా ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి టిటిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలో చేరేందుకు తెర వెనుక చర్చలు సాగుతునట్లు సమాచారం. వారి రాక కోసమే సిఎం కేసీఆర్‌ ఇంతవరకు మంత్రివర్గం ఏర్పాటు చేయలేదని మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారిలో ఒక మహిళా ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు సమాచారం. కనుక ఈనెల 18న మంత్రివర్గం ఏర్పడేనాటికి కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదు. ఎన్నికలలో బిజెపి, టిజేఎస్‌, వామపక్షాలు ఘోరపరాజయం పొందాయి కనుక కాంగ్రెస్ పార్టీ బలహీనపడితే ఇక రాష్ట్రంలో తెరాసకు ఎదురే ఉండదు.