తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ప్రకటన

జనవరి 17 నుంచి 20 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం సాయంత్రం ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. ఆనవాయితీ ప్రకారం గవర్నర్ నరసింహన్ ఒకరోజు ముందుగా ప్రోటెం స్పీకర్‌ చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. మజ్లీస్ పార్టీకి చెందిన ఛార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను ప్రోటెం స్పీకర్‌గా సిఎం కేసీఆర్ ఖరారు చేశారు. 

ఆ మరునాడు ఆయన శాసనసభ్యుల చేత ప్రమాణస్వీకారాలు చేయిస్తారు. శాసనసభ్యుల ప్రమాణస్వీకారం కార్యక్రమం పూర్తికాగానే ఆదేరోజున శాసనసభ స్పీకర్‌ ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించి నామినేషన్లు స్వీకరిస్తారు. జనవరి 18న శాసనసభ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఆదేరోజున స్పీకర్ బీఏసి సమావేశం నిర్వహిస్తారు. 

జనవరి 19వ తేదీన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో తొలి శాసనసభ సమావేశం జరుగుతుంది. అనావాయితీ ప్రకారం గవర్నర్ నరసింహన్ శాసనసభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు. ఆ మరునాడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టి దానిపై సభలో చర్చించి ఆమోదం తెలుపుతారు. ఒకవేళ అవసరమనుకుంటే శాసనసభ సమావేశాలను పొడిగిస్తారు లేకుంటే 20వ తేదీతో ముగిస్తారు. జనవరి 18న  శాసనసభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు కనుక అదే రోజున మంత్రివర్గం కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తాజా సమాచారం.