
అసెంబ్లీ ఎన్నికలలో తెరాస ప్రభంజనంలో అనేకమంది హేమాహేమీ కాంగ్రెస్ నేతలు ఓడిపోయారు. బిజెపి, టిజేఎస్, బిల్ఎఫ్ అభ్యర్ధులు డిపాజిట్లు కోల్పోయారు. వారితో పాటు తెరాసలో కొందరు హేమాహేమీలు కూడా ఓడిపోవడమే చాలా విచిత్రం.
మాజీ మంత్రులు తుమ్మల, చందూలాల్, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, పిడమర్తి రవి వంటివారు ఓటమి పాలయ్యారు. ఖమ్మం జిల్లాలో టిటిడిపి అభ్యర్ధి మెచ్చా నాగేశ్వరరావు చేతిలో తెరాస మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరులు ఓడిపోయారు.
తన ఓటమిపై స్పందిస్తూ, “యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకవైపు ఉంటే, మా ఖమ్మం జిల్లా ప్రజలు మరోవైపు నిలిచారు. గత నాలుగేళ్ళలో నా నియోజకవర్గంలో వందలకోట్లు విలువగల అభివృద్ధి పనులు చేయించాను. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేయించాను. కానీ ఎన్నికల సమయంలో జరిగిన కొన్ని పొరపాట్ల వలన ఓడిపోయాను. కారణాలు ఏవైనప్పటికీ ప్రజల తీర్పును అంగీకరిస్తున్నాను. రాజకీయాలలో గెలుపోటములు సహజమే. కనుక యధాప్రకారం నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటాను,” అని తాటి వెంకటేశ్వరులు చెప్పారు.