
రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గండిపేటలోగల ఆ పార్టీ నేత డికె అరుణ ఫాంహౌసులో అదివారం సమావేశం కానున్నారు. సిఎల్పీ నేతను ఎన్నుకోవడానికి వారు సమావేశం అవుతున్నరు. అయితే ఆ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్ధులు కూడా హాజరుకాబోతున్నారు. కనుక ఎన్నికలలో పార్టీ ఓటమికి కారణాలు, దాని కారకులపై సమావేశంలో వాడివేడిగా సాగే అవకాశం ఉందని భావించవచ్చు. టికెట్ల కేటాయింపు, సీట్ల సర్దుబాట్లులో జరిగిన ఆలస్యం కారణంగానే ఎన్నికలలో ఓడిపోయామని ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం అంగీకరించారు కనుక ఓడిపోయిన నేతలు రేపటి సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని నిందించకమానరు. ఒకవేళ అదే జరిగితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాకు సిద్దపడవచ్చు. కనుక రేపటి సమావేశం కీలకమైనదేనని భావించవచ్చు. అలాగే కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త్వరలో తెరాసలో చేరబోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నందున ఆ అంశంపై కూడా చర్చ జరుగవచ్చు.