
అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి షాక్ నుంచి మళ్ళీ ఇప్పుడిప్పుడే కొలుకొంటున్న ప్రతిపక్షాల నేతలు మళ్ళీ తెరాస ప్రభుత్వంపై యుద్దానికి సిద్దం అవుతున్నారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన బీసీ సంఘాల అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఇద్దరూ శనివారం ఉదయం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయడానికి సిద్దం అవుతున్నారు. పంచాయతీ ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్లు తగ్గించడాన్ని నిరసిస్తూ వారు రేపు ధర్నాకు సిద్దమవుతున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇందిరా పార్క్ వద్ద నుంచి ధర్నా చౌక్ ను ఎత్తివేసి చాలా కాలమే అయ్యింది కనుక రేపు వారు అక్కడ ధర్నా చేయడానికి పోలీసులు అనుమతించరని వేరే చెప్పనవసరం లేదు.