తెలంగాణ అభివృద్ధికి ఇంతకంటే ఏమి నిదర్శనం కావాలి?

ఒకప్పుడు అభివృద్ధి కాగితాలకే పరిమితమై ఉండేది. కానీ తెలంగాణ ఏర్పడి తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కళ్ళకు కనబడుతోంది. అందుకే ఎన్నికల ప్రచారంలో “మీ గ్రామాలలో, పట్టణాలలో అభివృద్ధి పనులు జరిగాయని మీరు నమ్మితేనే తెరాసకు ఓటేయండి లేకుంటే డిపాజిట్లు రాకుండా ఓడగొట్టండి,” అని సిఎం కేసీఆర్ నిర్భయంగా ప్రజలను కోరగలిగారు. అభివృద్ధి జరిగిందని ప్రజలు అంగీకరించబట్టే తెరాసకు 88 సీట్లు కట్టబెట్టి మళ్ళీ అధికారం అప్పజెప్పారు. అయితే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని జరుగుతోందని ప్రజలు అంగీకరించినప్పటికీ, ప్రతిపక్షపార్టీలు ఇంకా అంగీకరించడంలేదు.

వారు అంగీకరించకపోయినా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పధకాలను చూసి పొరుగునే మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ మండలంలోని 40 పంచాయితీలను తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలని కోరుతూ ఆయా గ్రామాల సర్పంచులు గురువారం ధర్మాబాద్ బ్లాక్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం వారు సదరు అధికారి మోహన్ జాదవ్ కు ఈ మేరకు ఒక వినతి పత్రం సమర్పించారు. (నిర్మల్ జిల్లాలోని ముథోల్, బాసరలకు సరిహద్దు జిల్లాగా ధర్మాబాద్ ఉంది.)             

పొరుగునే ఉన్న తెలంగాణ గ్రామాలలో అనేకానేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతుంటే, తమ గ్రామాలలో అటువంటి కార్యక్రమాలేవీ అమలుకావడం లేదని కనుక తమ 40 పంచాయతీలను తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వారు ఆ అధికారిని వినతిపత్రం ద్వారా కోరారు. త్వరలోనే తాము తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ను కూడా కలిసి తమ 40 పంచాయతీలను తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేసుకోవడానికి సహకరించవలసిందిగా కోరుతామని చెప్పారు. తెలంగాణ అమలవుతున్న సంక్షేమ పధకాలకు, జరుగుతున్న అభివృద్ధికి ఇంతకంటే ఏమి నిదర్శనం కావాలి?