ఉద్యోగ సంఘాలతో వేతన సవరణ కమీషన్ చర్చలు షురూ


తెలంగాణ రాష్ట్ర వేతన సవరణ కమీషన్ ఛైర్మన్ సిఆర్‌ బిశ్వాల్‌ నేతృత్వంలో కమిటీ సభ్యులు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో  వరుసగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీజీవో, టీఎన్జీవో, తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకులు వారికి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను అందజేశారు. 2018 జూలై 1వ తేదీ నుంచి కొత్త పీఆర్సీని అమలుచేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు పీఆర్సీ కమిటీని కోరారు. తమ డిమాండ్లపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకొని పీఆర్సీని అమలుచేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. 

ఉద్యోగ సంఘాల డిమాండ్లు: 

1. 2018 జూలై 1వ తేదీ నుంచి కొత్త పీఆర్సీని అమలుచేయాలి.

2. 63 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించాలి. 

3.  ఉద్యోగ విరమణ వయస్సును 58 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు పెంచాలి. 

4. కనీస వేతనం రూ.24 వేలు ఇవ్వాలి. 

5. ఐఆర్‌ 43 శాతం ప్రకటించాలి. 

6. ఇంటిఅద్దె అలవెన్సును జిల్లా, మండల, మున్సి పాల్టీ, గ్రామం వారీగా చెల్లించాలి. 

7. హైదరాబాద్‌లో 30 శాతం, జిల్లా కేంద్రాల్లో 25 శాతం, మండల, మున్సిపాల్టీల్లో 20 శాతం, గ్రామాల్లో 15 శాతం ఇంటిఅద్దె అలవెన్సు ఇవ్వాలి. 

8. హైదరాబాద్‌లో పనిచేసే ఉద్యోగులకు టీఏ లేదా ఉచిత బస్‌పాస్‌ సౌకర్యం కల్పించాలి. 

9. మూలవేతనంపై మూడు శాతం వార్షిక ఇంక్రిమెంటు చెల్లించాలి. 

10 ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీం క్రింద ప్రతీ ఐదేళ్ళకోసారి స్పెషల్‌ గ్రేడ్‌ ఇవ్వాలి. 

11. కనీసం రూ.12,000 పింఛన్ చెల్లించాలి. 

12. పింఛన్‌ అర్హత కొరకు ప్రస్తుతం ఉన్న కనీస సర్వీసు 20 ఏళ్ళను 15 ఏళ్ళకు తగ్గించాలి. 

13. గ్రాట్యూటీ గరిష్టంగా రూ.12 లక్షలు మంజూరు చేయాలి.