
అసెంబ్లీ ఎన్నికలలో తెరాస ప్రభంజనం సృష్టించి ఘనా విజయం సాధించినప్పటికీ, మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, చందూలాల్, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ ఎమ్మెల్యే పిడమర్తి రవి వంటి కొంతమంది తెరాస హేమాహేమీలు ఓడిపోయారు. కనుక తెరాస నియోజకవర్గ స్థాయి సమావేశాలలో దీనిపై జోరుగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. సత్తుపల్లి నుంచి టికెట్ ఆశించి భంగగపడిన డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్ కారణంగానే తాను ఓడిపోయానని పిడమర్తి రవి ఆరోపించారు. ఆయన తనకు టికెట్ దక్కలేదనే అక్కసుతో ప్రత్యర్ధికి సహకరించి తనను దెబ్బ తీశారని పిడమర్తి రవి ఆరోపించారు. కనుక డాక్టర్ మట్టా దయానంద్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పిడమర్తి రవి చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండిస్తున్నారు.
ఇక ఖమ్మం జిల్లా పాలేరులో నిన్న జరిగిన తెరాస విస్తృత స్థాయి సమావేశంలో తుమ్మల అనుచరులు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కాసేపు సమావేశంలో ఇరువర్గాల మద్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పొంగులేటిని తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కానీ తుమ్మల నాగేశ్వర రావు వెంటనే కలుగజేసుకొని, జిల్లాలో పార్టీ ఓటమికి తానే బాధ్యత వహిస్తున్నానని, కనుక ఓటమి గురించి ఒకరినొకరు నిందించుకోవడం సరికాదని సర్దిచెప్పడం అందరూ శాంతించారు.