
మరొక రెండు నెలలో లోక్సభ ఎన్నికల గంట మ్రోగబోతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనే వాటి కోసం తెరాస బలమైన పునాది వేసుకొంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత తెరాస వర్కింగ్ ప్రెసిడెంటుగా బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్, రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలలో 16 స్థానాలను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకొని పార్టీని సిద్దం చేస్తున్నారు.
అయితే తెరాస లోక్సభ అభ్యర్ధులు ఎవరు? పాత వారికే మళ్ళీ టికెట్లు కేటాయిస్తారా లేక కొంతమంది కొత్తవారికి అవకాశం కల్పిస్తారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కేటీఆర్ ఈరోజు సమాధానం చెప్పారు.
సిరిసిల్లాలో ఈరోజు జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కరీంనగర్ ఎంపీగా మళ్ళీ బి.వినోద్ కుమార్ కే అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించేందుకు పార్టీ కార్యకర్తలు అందరూ గట్టిగా కృషి చేయాలని కోరారు. కనుక లోక్సభ ఎన్నికలకు కూడా తెరాస శాసనసభ ఫార్ములానే కొనసాగిస్తూ సిట్టింగ్ ఎంపీలకే మళ్ళీ టికెట్లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది.