
తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 31వ తేదీన (జీవో నెం.533, 534) ఉత్తర్వులు జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాను విడదీసి ములుగు జిల్లాను, అలాగే మహబూబ్‌నగర్ జిల్లాను విడదీసి నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. పరిపాలనా సౌలభ్యం కోసమే రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు జీవోలో పేర్కొంది. కనుక వీటి ఏర్పాటు కోసం తక్షణం నోటిఫికేషన్ జారీ చేయాలని జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్లను రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి ఆదేశించారు. ఆ నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి 30 రోజులపాటు ఆయా జిల్లాల ప్రజలు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం వాటినన్నిటినీ పరిగణనలోకి తీసుకొని కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తుంది.
ములుగు జిల్లాలో మండలాలు: ములుగు, వెంకటాపురం, వెంకటాపూర్, గోవిందరావుపేట, మంగపేట,ఏటూరునాగారం, కన్నాయిగూడెం, తాడ్వాయి, వాజేడు. ప్రస్తుతం ఈ 9 మండలాలు ములుగు రెవెన్యూ డివిజన్ పరిధిలోనే ఉన్నాయి.
నారాయణ పేట జిల్లాలోని మండలాలు: నారాయణపేట, మక్తల్, మరికల్, దామరగిద్ద, కృష్ణ, మాగనూరు, మద్దూరు, ఊట్కూరు, నర్వ, కోయిల్‌కొండ, కోస్గి, ధన్వాడ. ఈ 12 మండలాలు ప్రస్తుతం నారాయణ పేట రెవెన్యూడివిజన్ లోనే ఉన్నాయి.
ఈ రెండు కొత్త జిల్లాలు కాక రాష్ట్రంలో మరో 4 కొత్త మండలాలను ఏర్పాటుకు ప్రభుత్వం వేరేగా జీవో జారీ చేసింది.
1. సిద్దిపేట జిల్లాలో నారాయణరావుపేట మండలం
2. నిజామాబాద్ జిల్లాలో చండూరు, మోస్రా మండలాలు
3. మేడ్చల్ జిల్లాలో మూడుచింతలపల్లి మండలం
వీటితో పాటు జనగామ జిల్లాలో నుంచి గుండాల మండలాన్ని విడదీసి యాదాద్రి భువనగిరి జిల్లాలో కలుపుతూ మరో జీవో జారీ చేసింది.