కూటమికి కోదండరాం గుడ్ బై?

అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ జనసమితి ఘోరపరాజయం పాలవడంతో ఇన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం మొదటిసారిగా మంగళవారం తమ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. “పంచాయతీ ఎన్నికలలో మా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికలలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని క్షేత్రస్థాయిలో మాకు బలం ఉందని భావించిన చోట మాత్రమే పోటీ చేస్తాము. గ్రామస్థాయిలో పొత్తులపై జిల్లా స్థాయి కమిటీలే నిర్ణయాలు తీసుకొంటాయి. ఈవిషయంలో మేమేవరం జోక్యం చేసుకోము. జిల్లా నేతలకు పూర్తి స్వేచ్చ ఉంటుంది. గ్రామాభివృద్ధికి కష్టపడే స్థానిక యువతకు, స్థానిక రిటైర్డ్ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాము,” అని చెప్పారు. 

పంచాయతీ ఎన్నికలలో టిజేఎస్‌ ఒంటరిగా పోటీ చేస్తోందంటే దానర్ధం ప్రజాకూటమికి దానిలో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసినట్లే భావించవచ్చు. అసెంబ్లీ ఎన్నికలలో ప్రజాకూటమి ప్రయోగం విఫలం అవడంతో దానిలో భాగస్వాములుగా ఉన్న నాలుగు పార్టీలు కూటమి కొనసాగింపుపై విముఖత చూపుతున్నాయి. పంచాయతీ ఎన్నికలలో కలిసి పోటీ చేయనప్పటికీ గ్రామస్థాయిలో అవసరమైతే ఒకదానికొకటి సహకరించుకొనే అవకాశం ఉంటుంది.