రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలపై ఒత్తిళ్ళు

పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాలలో కాంగ్రెస్ కార్యకర్తలు అధికార, ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ లోనే కొనసాగమని ఆ పార్టీ నేతలు, తెరాసలోకి రావాలని ఆ పార్టీ నేతలు ఒత్తిళ్ళు చేస్తుండటంతో వారు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఖమ్మం జిల్లాలోని రఘనాధపాలెం మండలం బూడిదంపాడులో కాంగ్రెస్ కార్యకర్తలకు సరిగ్గా ఇటువంటి పరిస్థితే ఎదురైంది. తెరాస ఒత్తిళ్లకు తలొగ్గి దాదాపు 10 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం ఉదయం ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ సమక్షంలో తెరాసలో చేరారు. మళ్ళీ కొన్ని గంటల వ్యవధిలోనే వారు మళ్ళీ మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మానుకొండ రాధాకిషోర్‌ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి తిరిగివచ్చేశారు. తెరాస నేతలు తమను ప్రలోభాలకు గురి చేసి పార్టీలోకి ఆకర్షించినప్పటికీ కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబందం కారణంగా మళ్ళీ వెంటనే వెనక్కు తిరిగి వచ్చేశామని వారు చెప్పారు. ఇకపై తెరాస ఎటువంటి ఒత్తిళ్ళకు తలొగ్గమని పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు గట్టిగా కృషి చేస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పారు. 

బూడిదంపాడులో నెలకొన్న పరిస్థితులే రాష్ట్రంలో అన్నీ గ్రామాలలో నెలకొని ఉన్నాయని చెప్పవచ్చు. పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఇటువంటి ఒత్తిళ్ళు భరించక తప్పకపోవచ్చు.