మైనింగ్ శాఖలో అక్రమాలపై మంత్రి కేటీఆర్ కొరడా ఝుళిపించారు. అక్రమాలకు పాల్పడ్డ మహబూబ్ నగర్ గుడిబండ రీచ్ అనుమతిని రద్దు చేశారు. అక్కడి ఏడీని, రాయల్టీ ఇన్‌స్పెక్టర్ ను సస్పెండ్ చేశారు. మైనింగ్ లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలేనని ఈ సందర్భంగా హెచ్చరించారు. మైనింగ్ ఆదాయం జాతి సంపదని, అది ప్రజలకే చెందాలన్నారు కేటీఆర్.
పాలమూరు జిల్లాలో ప్రైవేటు పట్టా భూమిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి చూశారు. ఆ జిల్లాలోని గుడిబండలో పట్టాభూమిలో అనుమతి ఇచ్చిన 1950 క్యూబిక్ మీటర్లకు మించి నిబంధనలను అతిక్రమించి కాంట్రాక్టర్ దాదాపు 60వేల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకాలు జరిపించినట్లు తేల్చారు. ఈ సమాచారాన్ని వెంటనే మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో ప్రైవేటు వ్యక్తులు చట్ట విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నా నియంత్రించడంలో విఫలమైన జిల్లా ఏడీ కృష్ణప్రతాప్‌తో పాటు రాయల్టీ ఇన్‌స్పెక్టర్ రవికుమార్‌లను వెంటనే సస్పెండ్ చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. పరిమితికి మించి తవ్వకాలు జరిపిన కాంట్రాక్టర్‌కు అనుమతులు రద్దు చేసి జరిమానా వేసి, అతనిపై కేసు నమోదు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.