సిఎంను కలుస్తున్నాము కానీ...తెరాసలో చేరడం లేదు: శ్రీధర్

ఇవాళ్ళ ముఖ్యమంత్రి కేసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు  శ్రీధర్ బాబు, గండ్ర వెంకటరమణా రెడ్డి ఆయనను కాలువబోతున్నారు. వారిరువురూ టీఆర్ఎస్‌లో చేరేందుకే ఆయనను కలుస్తున్నారని మీడియాలో వస్తున్న ఊహాగానాలను వారు ఖండించారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా కలుస్తున్నాము తప్ప టీఆర్ఎస్‌లో చేరే ఉద్దేశ్యంతో కాదని వారు చెప్పారు. నేటికీ తాము కాళేశ్వరం రీడిజైనింగ్ పై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే తమ ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని చెపుతూనే అదే ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి వచ్చిన సిఎం కేసీఆర్ ను కలుస్తున్నపుడు వారికి టీఆర్ఎస్‌లో చేరే ఉద్దేశ్యం లేదని ఏవిధంగా అనుకోగలము? 

సిఎం కేసీఆర్ ఇవాళ్ళ మేడిగడ్డ, సుందిళ్ల అన్నారం బ్యారేజీలు, వాటి పంప్‌హౌస్‌ పనులను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేస్తారు. ఈరోజు సాయంత్రం కరీంనగర్‌లో తీగలపల్లి గెస్ట్ హౌసులో బస చేసి రేపు ఉదయం     శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం, రాజేశ్వరరావుపేట, రాంపూర్‌లో పంప్‌హౌస్‌ల నిర్మాణ పనులను పరిశీలిస్తారు.