ప్రత్యక్ష రాజకీయాలలోకి మరో అగ్రనటుడు

తమిళనాడు సినీపరిశ్రమలో ప్రముఖ నటులు కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరూ ప్రత్యక్ష రాజకీయాలలోకి దిగి వేర్వేరు పార్టీలతో సార్వత్రిక ఎన్నికలలో పోటీకి సిద్దం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ప్రత్యక్ష రాజకీయాలలోకి దిగుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయబోతున్నట్లు ట్వీట్ చేశారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయబోయేది త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. ఈసారి కేంద్రంలో రాబోయేది ప్రజాప్రభుత్వమే అంటూ ట్వీట్ చేయడం విశేషం. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన హైదారాబాద్ వచ్చి సిఎం కేసీఆర్ తో మాట్లాడి వెళ్ళిన తరువాత కేసిఆర్ బెంగళూరు వెళ్ళి జెడిఎస్ అధినేత హెడి. దేవగౌడ ఆయన కుమారుడు కుమారస్వామిలతో సమావేశం అయ్యారు. కెసిఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ గురించి వారు చర్చించారు. ఫెడరల్ ఫ్రంట్ పై దేవగౌడ, కుమారస్వామి తమ పార్టీ వైఖరిని స్పష్టం చేయనప్పటికీ ప్రకాష్ రాజ్ మాత్రం కేసిఆర్ ప్రయత్నాలకు సంఘీభావం తెలిపారు. కనుక కేసిఆర్ అంగీకరిస్తే ప్రకాష్ రాజ్ తెలంగాణ రాష్ట్రం నుంచే లోక్‌సభకు పోటీ చేసినా ఆశ్చర్యం లేదు.