
కూకట్‌పల్లి తెరాస ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదివారం స్థానిక మెట్రో మైదానంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “తెరాస ప్రభుత్వ పనితీరు చూసి ఓటేసి గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు భీమా వంటి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశంలో వివిద రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి. అదేవిధంగా మనం ప్రవేశ పెట్టిన పాలనా సంస్కరణలను, ఇక టిఎస్ ఐపాస్ వంటి నూతన పారిశ్రామిక విధానాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని అమలుచేస్తునానాయి. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న మన తెలంగాణ రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి సాదించడమే కాకుండా, దేశాన్ని కూడా అభివృద్ధిపధంలో నడిపించాలనుయి భావిస్తోంది. ఆ ప్రయత్నాలలో భాగంగానే సిఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు సాధించుకోవాలంటే తెరాస 16 లోక్‌సభ స్థానాలు గెలుచుకోవలసి ఉంది. అప్పుడే కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషించగలుగుతాము. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాని నరేంద్రమోడీతో సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు వచ్చి ప్రచారం చేసిన రాష్ట్రంలో బిజెపి ఒకే ఒక్క సీటు గెలుచుకోగలిగింది. లోక్‌సభ ఎన్నికలలో కూడా బిజెపికి ఇదేవిధంగా ఓటమి ఎదుర్కోబోతోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి 150కు మించి సీట్లు లభించే అవకాశం లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు వరకు రావచ్చు. అప్పుడు ఫెడరల్ ఫ్రంట్ కీలకపాత్ర పోషించడం ఖాయం. కనుక ఇప్పటి నుంచే తెరాస నేతలు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయడం మొదలుపెట్టాలి,” అని కేటీఆర్ అన్నారు.