ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియ షురూ!

ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియ నేడు మొదలైంది. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న తాత్కాలిక హైకోర్టు భావనా సముదాయాలు ఇంకా సిద్దంకానందున అవి పూర్తయ్యేవరకు హైకోర్టు విభజనను వాయిదా వేయాలని కోరుతూ ఏపీ న్యాయవాదులు వేసిన హౌస్ మోషన్ పిటిషనుపై తక్షణం విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియ ఈరోజు మొదలైంది. ఇంతకాలం ఉమ్మడి హైకోర్టులో పనిచేస్తున్న ఏపీకి కేటాయించబడిన న్యాయమూర్తులు, సిబ్బంది, ఏపీ హైకోర్టుకు సంబందించిన దస్తావేజులతో ఈరోజు మధ్యాహ్నం 10 బస్సులలో విజయవాడకు బయలుదేరారు. గత మూడు, నాలుగు దశాబ్ధాలుగా ఆంధ్రా, తెలంగాణ న్యాయవాదులు కలిసిమెలిసి పనిచేసినందున ఈసందర్భంగా హైకోర్టు ఆవరణలో ఉద్వేగభరితమైన వాతావారణం నెలకొంది. విజయవాడ  తరలివెళుతున్న తమ సహచర న్యాయవాదులకు తెలంగాణ న్యాయవాదులు ఆప్యాయంగా వీడ్కోలు పలికారు. 

రేపు ఉదయం 8.30 గంటలకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిబి రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేస్తారు. అదేవిదంగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్‌ కూడా రేపు విజయవాడలో ప్రమాణస్వీకారం చేస్తారు. అనంతరం రెండు రాష్ట్రాలకు కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు కూడా ప్రమాణస్వీకారం చేస్తారు.