అవసరమైతే ట్రంప్ తో మాట్లాడుతా: కెఏ పాల్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ ఊహించినట్లుగానే తనకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తదితరులతో నేరుగా మాట్లాడి సమస్యలను పరిష్కరించగల శక్తి ఉందని చెప్పారు.ఈరోజు విశాఖపట్నంలో తన పార్టీ కార్యాలయం ప్రారంభించిన  తరువాత పాల్ మీడియాతో మాట్లాడుతూ, "పాకిస్తాన్ చెరలో ఉన్న 22 మంది భారతీయ మత్స్యకారులను విడిపించడానికి అవసరమైతే నేనే పాకిస్తాన్ వెళ్లి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో మాట్లాడి విడిపించుకొని వస్తాను. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ అందుకు అంగీకరించకపోతే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేత చెప్పించి ఒప్పిస్తాను.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని నేను ఎప్పుడో చెప్పాను అదే జరిగింది. ఏపీలో  జరగబోయే శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో కూడా చంద్రబాబు నాయుడు... ఆయన పార్టీ ఓడిపోవడం ఖాయం. రాష్ట్రంలో మా ప్రజాశాంతి పార్టీతో కలిసి వచ్చే అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకొంటాము. మేము అధికారంలోకి రాగానే మొదటి రోజునే 50 శాతం రైతుల రుణాలు మాఫీ చేస్తాము. మిగిలిన 50 శాతం ఐదేళ్లలో పూర్తిగా మాఫీ చేస్తాము. నాకున్న జాతీయ, అంతర్జాతీయ పరిచయాలు...పలుకుబడితో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రూ. 7 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకురాగాలను," అని కెఏ పాల్ చెప్పారు.