బాబు పూటకో మాట... రోజుకో కుట్ర: కెసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీ నుంచి హైదారాబాద్ తిరిగిరాగానే ప్రగతి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. 

హైకోర్టు విభజన, తరలింపుపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, "రెండేళ్ళ నుంచి హైదారాబాద్ లోనే ఏపీకి తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు చేసుకోవడానికి మేము భవనాలను ఇస్తామంటే స్పందించని చంద్రబాబు దీనిపై సుప్రీం కోర్టు నిలదీసినప్పుడు డిసెంబరులోగా అమరావతికి హైకోర్టును తరలించుకుపోతమని అఫిడవిట్ ద్వారా హామీ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? అప్పుడు అలాగ చెప్పి ఇప్పుడు జనవరిలో హైకోర్టును విభజించడం అన్యాయం, తొందరపాటు అని చెపుతున్నాడు. ఆయన మాట్లాడే మాటలకు అర్ధం ఏమైనా ఉందా?" అని కెసీఆర్ ప్రశ్నించారు. 

అసెంబ్లీ ఎన్నికలలో స్వర్గీయ హరికృష్ణ కుమార్తె సుహాసినిని కూకట్ పల్లి నుంచి పోటీ చేయించడం గురించి మాట్లాడుతూ, "చంద్రబాబు చేసిన హరికృష్ణ శవంపై పేలాలు ఏరుకొనే రాజకీయమే. హరికృష్ణ బ్రతికి ఉన్నప్పుడూ ఆయనకు అన్యాయం చేశాడు. చనిపోయాక ఆయన కూతురుకు అన్యాయం చేశాడు. రాజకీయాల గురించి ఏమీ తెలియని ఆ అమాయకురాలిని చంద్రబాబు ఎన్నికలలో బలి చేశాడు. ఎన్నికలైపోగానే ఆమెను గాలికొదిలేశాడు. అవసరమైనప్పుడు వాడుకోవడం తీరిపోగానే పక్కన పడేయడం చంద్రబాబుకు అలవాటే," అని విమర్శించారు.  

ఏపీకి ప్రత్యేకహోదా గురించి తాను ఎన్నడూ అడ్డుపడలేదని, ఏపీకి హోదా రాకపోవడానికి ప్రధానకారకుడు చంద్రబాబు నాయుడేనని సిఎం కేసీఆర్ అన్నారు. ఒకసారి హోదా వద్దని ఒకసారి ప్యాకేజీ చాలని, మరోసారి హోదా కావాలని రోజుకో మాట మాట్లాడుతూ పనికిమాలిన రాజకీయాలు చేయడం వలననే ఏపీకి ప్రత్యేకహోదా రాలేదని కేసీఆర్ అన్నారు. చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వం రూపొందించిన నూతన పారిశ్రామిక విధానాన్ని దొంగిలించాడని సిఎం కేసీఆర్ ఆరోపించారు.ఆయన నీచరాజకీయాలు మాత్రమే చేయగలడు. అటువంటి నీతినిజాయితీ లేని రాజకీయనాయకుడు దేశంలో మరొకరు ఉండడు," అని కేసీఆర్ అన్నారు.