తెరాసలోకి కాంగ్రెస్ జెడ్పీటీసీ జంప్?

అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోవడంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఊహించినట్లే పాత కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి. ఆ పార్టీకి చెందిన నేతలు తెరాసలోకి వెళ్ళిపోయేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తాజాగా మహబూబాద్ కాంగ్రెస్ జెడ్పీటీసీ ఎం.వెంకన్న తెరాసలోకి జంప్ చేయడానికిగాను మొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని రహస్యంగా కలిసి మంతనాలు జరిపారు. కనుక ఒకటి రెండు రోజులలోనే వెంకన్న తెరాసలోకి జంప్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.

ఉమ్మడి వరంగల్ నుంచి 26మంది కాంగ్రెస్ జెడ్పీటీసీలు ఎన్నికవగా వారిలో జెడ్పీటీసీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న ఆత్మకూరు జెడ్పీటీసీ సంజీవరెడ్డితో సహా 20 మందిఇప్పటికే జంప్ అయిపోయారు. ఇప్పుడు ఫ్లోర్ లీడర్ ఎం వెంకన్నతో సహా మిగిలిన ఆరుగురుజెడ్పీటీసీలు జంప్ చేసినట్లయితే, మహబూబాద్ కాంగ్రెస్ జిల్లా పరిషత్ లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయినట్లే.

ఒకపక్క ప్రతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎంతో కష్టపడి తన అభ్యర్ధులను గెలిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే, ఎన్నికలవగానే గెలిచిన అభ్యర్ధులు ఈవిధంగా ఎగిరిపోతుండటం ఆపార్టీని కోలుకోనీయకుండా చేస్తోంది. రేపు పంచాయతీ ఎన్నికల తరువాత మళ్ళీ ఇదే జరిగినా ఆశ్చర్యం లేదు. కనుక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెరాస ప్రభుత్వాన్ని ఏవిధంగా ఎదుర్కోవాలని ఆలోచించే బదులు, పార్టీ తరపున గెలిచిన వారు తెరాసలోకి వెళ్లిపోకుండా ఏవిధంగా కాపాడుకోవాలని ఆలోచిస్తే మంచిది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యకు పరిష్కారం కనుగొనలేకపోతే రాష్ట్రంలో దాని మనుగడ కష్టమే.