తొలిసంతకంతోనే బీసీలకు అన్యాయం: జాజుల

పంచాయతీ ఎన్నికలలో బీసీలకు 34శాతం ఉన్న రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం 22 శాతానికి తగ్గిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని ప్రతిపక్షపార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, బీసీ సంఘాల నేతలు శ్రీనివాస్ గౌడ్, జాజుల శ్రీనివాస్ తదితరులు శుక్రవారం సచివాలయానికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్.కె.జోషిని కలిసి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆ ఆర్డినెన్సును ఉపసంహరించుకోవలసిందిగా చేశారు. బిసి జనాభా లెక్కలు తీసిన తరువాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ వారు ఎస్.కె.జోషికి వినతిపత్రం ఇచ్చారు. 

అనంతరం పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ,“బీసీలకు న్యాయం చేస్తామంటూనే తెరాస ప్రభుత్వం వారికి న్యాయంగా దక్కవలసిన రిజర్వేషన్లలో కోత పెట్టింది. ఇది బీసీల హక్కులను, ఆత్మగౌరవాన్ని హరించడమే. బీసీల హక్కులకు, ఆత్మగౌరవానికి, వారి ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్న ఆ ఆర్డినెన్సును రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలి. అంతవరకు మా పోరాటం కొనసాగిస్తాము,” అని చెప్పారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ,“సుప్రీంకోర్టు ఉత్తర్వులను సాకుగా చూపుతూ గత మూడు దశాబ్ధాలుగా బీసీలకు ఇస్తున్న రిజర్వేషన్లలో తెరాస సర్కార్ కోత విధించడం చాలా అన్యాయం. బీసీ రిజర్వేషన్లపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని మేము గతంలోనే కోరాము. కానీ కెసిఆర్ మా సూచనలను పట్టించుకోలేదు. అందుకే నేడు ఈ సమస్య ఉత్పన్నం అయ్యింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూనే బీసీలకు మరణశాసనం వంటి ఆర్డినెన్సుపై తొలి సంతకం చేశారు,” అని అన్నారు. 

  జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ,“ సిఎం కెసిఆర్ మొన్న ప్రధాని నరేంద్రమోడీని కలిసినప్పుడు ఇతర విషయాలన్నిటిపై మాట్లాడారు కానీ బీసీ రిజర్వేషన్లు అంశంపై ఎందుకు మాట్లాడలేదు? సుప్రీంకోర్టు తీర్పును చూపుతూ బీసీలకు అన్యాయం చేస్తే సహించబోము,” అని హెచ్చరించారు.