అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేయనట్లేనా?

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నల్గొండ నుంచి పోటీ చేసి అనూహ్యంగా ఓడిపోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పటి నుంచి మీడియా ముందుకు రానేలేదు. కానీ మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, “నా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నుంచి లోక్ సభకు పోటీ చేస్తారు,” అని చెప్పారు. అయితే నేటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లోక్ సభకు పోటీ చేయడంపై తన అభిప్రాయం చెప్పలేదు.

కానీ నల్గొండకే చెందిన తెలంగాణ పిసిసి రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేశ్ రెడ్డి బుదవారం నల్గొండ జిల్లా కేంద్రంలో తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, “రానున్న లోక్ సభ ఎన్నికలలో నేను నల్గొండ నుంచి పోటీ చేయబోతున్నాను,” అని ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన తెరాసపై, సిఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. అవి అప్రస్తుతం. పటేల్ రమేశ్ రెడ్డి నల్గొండ నుంచి లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయబోతునట్లు ప్రకటించారంటే దానార్ధం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లా లేక పటేల్ రమేశ్ రెడ్డి టికెట్ కోసం ఆయనతో పోటీకి సిద్దమయ్యారా? అనే విషయం తెలియవలసి ఉంది.