
ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీ పర్యటన ముగించుకొని గురువారం హైదరాబాద్ చేరుకోబోతున్నారు. వచ్చిన వెంటనే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం శాసనసభ సమావేశాల షెడ్యూల్ ఖరారు చేస్తారు. జనవరి 4 తరువాత మళ్ళీ సంక్రాంతి వెళ్ళేవరకు మంచి ముహూర్తాలు లేనందున ఆలోగానే మంత్రివర్గం కూడా ఏర్పాటు చేయడం ఖాయం.
శాసనసభ సమావేశాలు కోసం శాసనసభ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కనుక సిఎం కేసీఆర్ షెడ్యూల్ ఖరారు చేయడమే ఆలస్యం రేపటి నుంచి ఎప్పుడైనా శాసనసభ సమావేశాల నిర్వహణకు అందరూ సిద్దంగా ఉన్నారు.
శాసనసభ సమావేశాలకు ముందే స్పీకర్, డెప్యూటీ స్పీకర్ పేర్లను సిఎం కేసీఆర్ ఖరారు చేయవలసి ఉంటుంది. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తికాగానే లాంఛనంగా స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఆ తరువాత మంత్రివర్గం ఏర్పాటుకు సర్వం సిద్దం అయినట్లే. ఈ రెండు కార్యక్రమాలు ముగిస్తే కొత్త ప్రభుత్వం కొలువు తీరినట్లే.
తొలి విడతలో 8-10 మంది మంత్రులతో మాత్రమే సిఎం కేసీఆర్ మంత్రివర్గం ఏర్పాటు చేయబోతునట్లు సమాచారం. మొదటి విడతలో ఎవరెవరికి మంత్రిపదవులు లభిస్తాయి? స్పీకర్, డెప్యూటీ స్పీకర్ పదవులకు సిఎం కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారు? అనే ప్రశ్నలకు నేడో రేపో సమాధానాలు లభించవచ్చు. కనుక నేటి నుంచి మళ్ళీ తెరాసలో మళ్ళీ హడావుడి మొదలవుతుంది.లోక్ సభ ఎన్నికల తరువాత పూర్తిస్థాయిలో అంటే సిఎం కేసీఆర్‌తో కలిపి మొత్తం 16మంది మంత్రులతో మంత్రివర్గం ఏర్పాటు చేయాలని సిఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.