
విశాఖపట్నంలోని శారదా పీఠాధిపతి స్వరూపనంద స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. సినీ నటి రమ్యశ్రీ నేతృత్వంలో మహిమంది మహిళలు విమానాశ్రయం వద్ద కేసీఆర్‌కు బోనాలతో స్వాగతం పలికారు.విశాఖ విమానాశ్రయం నుంచి శారదాపీఠం వరకు సుమారు 10 కిమీ దారిపొడవునా కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఆయనను చూసేందుకు శారదాపీఠం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. కొంతమంది గులాబీ కండువాలు, తెరాస జెండాలు పట్టుకొని మరీ కేసీఆర్‌కు స్వాగతం పలికారు. కేసీఆర్ వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కేసీఆర్ విశాఖ పర్యటన సందర్భంగా నగరానికి చెందిన పలువురు ప్రముఖులు వచ్చి ఆయనను కలిశారు.
సిఎం కేసీఆర్ సతీసమేతంగా స్వరూపనంద స్వామిని దర్శించుకొని ఆయనకు పళ్ళు, పూజలు సమర్పించుకొన్నారు. సిఎం కేసీఆర్ ఆయనకు స్రాష్టాంగదండ ప్రమాణం చేసి తన భక్తిని చాటుకొన్నారు. పీఠంలో గల ఆలయాలలో ప్రత్యేకపూజలు చేసీన తరువాత కేసీఆర్ దంపతులు అక్కడ జరిగిన హోమంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం భోజనం కూడా పీఠంలోనే చేశారు. తరువాత కాసేపు స్వామీజీతో కేసీఆర్ ఏకాంతంగా మాట్లాడారు. మధ్యాహ్నం 2గంటలకు మళ్ళీ విశాఖ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి భువనేశ్వర్ వెళ్లారు.