హైకోర్టును ఆశ్రయించిన మల్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసి కేవలం 376 ఓట్లు తేడాతో ఓడిపోయిన మల్‌రెడ్డి రంగారెడ్డి, తన నియోజకవర్గంలో మళ్ళీ ఓట్లు లెక్కించాలని ఎన్నికల సంఘం ప్రధానాధికారిని ఆదేశించాలని కోరుతూ శనివారం హైకోర్టులో పిటిషను వేశారు. 199, 221 నెంబరు పోలింగ్ స్టేషన్లలో ఈవిఎంలలో నమోదైన ఓట్లకు, వివి ఫ్యాట్ రసీదులలో నమోదైన ఓట్లకు తేడాలున్నాయని, తన నియోజకవర్గంలో ఇతర పోలింగ్ స్టేషన్లలో కూడా ఇటువంటి అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. వాటి గురించి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి, ప్రధానాధికారి రజత్ కుమార్ లకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మల్‌రెడ్డి రంగారెడ్డి తన పిటిషనులో పేర్కొన్నారు. 

వివి ఫ్యాట్ యంత్రాలు, రసీదులు పారదర్శకత కోసమే ఏర్పాటు చేశారని కానీ వాటిని ఎన్నికల సంఘం అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. కనుక ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అన్ని పోలింగ్ స్టేషన్లలో మళ్ళీ ఓట్లను లెక్కించాలని ఎన్నికల సంఘం ప్రధానాధికారిని ఆదేశించాలని మల్‌రెడ్డి రంగారెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. 

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టిబి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మల్‌రెడ్డి రంగారెడ్డి పిటిషనుపై నేడు (శనివారం) విచారణ జరిపింది. కానీ ఎన్నికల సంఘం తరపు న్యాయవాది రాకపోవడంతో ఈ కేసును ఈనెల 26వ తేదీకి వాయిదా వేసింది. ఆరోజున పూర్తి వివరాలతో కోర్టుకు హాజరుకావాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.