
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి మీడియాకు దూరంగా ఉంటున్న పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం మౌనం వీడి మీడియాతో మాట్లాడారు. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, ప్రభాకర్ రావు, సంతోష్ కుమార్, ఆకుల లలిత తమను తెరాసలో విలీనం చేయాలని కోరుతూ మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌కు లేఖ ఇవ్వడంపై అభ్యంతరం తెలిపేందుకు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మండలి విపక్షనేత షబ్బీర్ ఆలీతో కలిసి శుక్రవారం స్వామిగౌడ్‌ను కలిశారు.
పార్టీలో లేని ఎమ్మెల్సీలు సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం, తమను తెరాసలో విలీనం చేయాలని తీర్మానం చేయడం, మండలి ఛైర్మన్‌కు లేఖ ఇవ్వడం ఏదీ చెల్లుబాటు కావని, కనుక రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న చైర్మన్ వారి లేఖను తిరస్కరించి వారిపై చర్యలు తీసుకోవాలని స్వామిగౌడ్‌కు చేశామని ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు తెలియజేశారు. రెండేళ్ల కింద పార్టీ ఫిరాయించి తెరాసలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ప్రభాకర్ రావులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామని, ఒకవేళ మండలి ఛైర్మన్ తమ అభ్యర్ధనను పట్టించుకోకుండా తెరాసకు అనుకూలంగా వ్యవహరించినట్లయితే ఈ వ్యవహారాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.