
అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెరాసను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండా మురళీ దంపతులు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. “మాకు పదవులు కంటే ఆత్మగౌరవమే ముఖ్యం. ఆత్మగౌరవం లేకపోయినా పదవులు పట్టుకొని వ్రేలాడే అలవాటు మాకు లేదు. గతంలో మేము నమ్మిన నేత కోసం మంత్రిపదవినే వదులుకొన్నాము. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి మాకు ముఖ్యం కాదు. అందుకు నా పదవికి రాజీనామా చేయబోతున్నాను,” అని కొండా మురళి చెప్పారు.
కొండా దంపతులు తమకు పదవులు అవసరం లేదని చెపుతున్నప్పటికీ వాస్తవాలు ప్రజలందరికీ తెలుసు. కొండా సురేఖకు అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ ఇవ్వన్నందుకు హైదరాబాద్లో మీడియా సమావేశం పెట్టి సిఎం కేసీఆర్ను తిట్టిపోయడం అందరికీ గుర్తుండే ఉంటుంది. టికెట్ ఇవ్వనందుకే వారిరువురూ పార్టీని వీడారు...పరకాల నుంచి టికెట్ కు హామీ లభించినందునే వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. లేకుంటే మరో పార్టీలో చేరి ఉండేవారు. అంటే పదవుల కోసం వారు ఎంతగా అర్రూలు చాస్తున్నారో అర్ధం అవుతుంది. ఒకవేళ తెరాసలో టికెట్ లభించకపోయినా వారు పార్టీలోనే ఉండి ఉంటే ఇటువంటి మాటలు నమ్మశక్యంగా ఉండేవి.
కొండా మురళి ఎమ్మెల్సీ పదవికి ఎందుకు రాజీనామా చేస్తున్నారంటే, పార్టీ ఫిరాయించినందుకు ఆయనతో సహా ముగ్గురు తెరాస ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసేందుకు తెరాస పావులు కదుపుతోంది కనుకనే. లేకుంటే పదవీ కాలం పూర్తయ్యేవరకు దానిలోనే కొనసాగి ఉండేవారు. అయితే దేశంలో ఇటువంటి అవకాశవాద రాజకీయనాయకులు చాలా మందే ఉన్నారు. అందరూ ఇంచుమించు ఇదేవిధంగా ప్రవర్తిస్తుంటారు. కనుక కొండా దంపతుల మాటలు విని ఎవరూ ఆశ్చర్యపోరు.