తెరాస ఎంపీల కృషి ఫలించింది

అసెంబ్లీ ఎన్నికల హడావుడి ముగియగానే తెరాస ఎంపీలు మళ్ళీ కేంద్రమంత్రుల చుట్టూ తిరుగుతూ రాష్ట్రానికి రావలసిన వాటిని సాధించుకొనే పనిలో పడ్డారు. ఎంపీలు కల్వకుంట్ల కవిత, జితేందర్‌రెడ్డి, బోయినపల్లి వినోద్‌కుమార్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, నగేశ్‌, బీబీ పాటిల్‌, బండా ప్రకాశ్‌, బడుగుల లింగయ్య యాదవ్‌లు కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలిసి రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం మంజూరు చేసిన రూ.450 కోట్లు విడుదల చేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. దానిపై అరుణ్ జైట్లీ సానుకూలంగా స్పందిస్తూ వారంరోజులలోగా నిధుల విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. 

అనంతరం వారు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌నుకలిసి హైకోర్టు విభజన ప్రక్రియను వేగవంతం చేసి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరగా ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. నాలుగైదు రోజులలో దీనికోసం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేస్తామని హామీ ఇచ్చారు. అమరావతిలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిద్దం అవుతోందని కనుక ఇక ఉమ్మడి హైకోర్టు విభజన ఆలస్యం జరుగదని చెప్పారు. 

తరువాత తెరాస ఎంపీలు కేంద్ర రైల్వేశాఖా మంత్రి పీయూష్ గోయెల్ ను కలిసి వరంగల్‌ జిల్లాలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల నిర్మాణపనులను వేగవంతం చేయాలని కోరారు. రాష్ట్ర  వ్యాప్తంగా కొన్ని రైల్వేస్టేషన్లలో ఎక్స్ ప్రెస్ రైళ్ళను ఆపాలని వారు చేసిన విజ్ఞప్తిపై రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు.