ఏపీలో కూడా ఎన్నికల హడావుడి షురూ

ఏపీ సిఎం చంద్రబాబునాయుడు కూడా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గంట కొట్టేశారు. బుదవారం ఆయన వివిద జిల్లాలలోని పార్టీ కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించినప్పుడు, ఫిబ్రవరి లేదా మార్చి మొదటివారంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కనుక అందరూ ఎన్నికలకు సిద్దం కావాలని కోరారు. జనవరిలో సంక్రాంతి పండుగ తరువాత అభ్యర్ధుల మొదటి జాబితాను విడుదల చేస్తామని ప్రకటించారు. మొదటి జాబితాలో సుమారు 60-70 మంది పేర్లు ఉండవచ్చునని తెలిపారు. మొదటి జాబితా విడుదల చేసిన కొద్ది రోజులలోపే మిగిలిన అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తామని తెలిపారు. తద్వారా పార్టీ అభ్యర్ధులకు ఎన్నికలకు సిద్దం కావడానికి, ఎన్నికల  ప్రచారం చేసుకోవడానికి ఎక్కువ సమయం లభిస్తుందని చంద్రబాబునాయుడు చెప్పారు.