
సెప్టెంబరు 6వ తేదీ నుంచి డిసెంబరు 11వరకు 3 నెలలకు పైగా రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కొనసాగింది. అది ముగియగానే మళ్ళీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. హైకోర్టు ఆదేశానుసారం జనవరి 10వ తేదీలోగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుంది. కనుక రాష్ట్ర ఎన్నికల సంఘం వాటి కోసం చురుకుగా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలను ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు అందజేశామని, రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ నిర్ణయం తీసుకొని ప్రకటిస్తే డిసెంబరు 31 తరువాత ఎప్పుడైనా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి మీడియాకు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.26 లక్షలు వరకు వార్డు మెంబర్లు, సర్పంచి పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహింపపడుతున్నప్పటికీ, పంచాయతీ ఎన్నికలలో ఎక్కువ స్థానాలను గెలుపొందిన వారికే గ్రామాలపై పట్టు లభిస్తుంది కనుక వివిద రాజకీయ పార్టీలు తమ సభ్యులను లేదా తమ అనుబంద సంఘాల సభ్యులను గెలిపించుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. పట్టణాలలో కంటే గ్రామాలలో రాజకీయాలు మరికాస్త ఎక్కువగా ఉంటాయి కనుక అప్పుడే అన్ని గ్రామాలలో రాజకీయవాతావరణం వేడెక్కుతోంది.