త్వరలో హైటెక్ సిటీకి మెట్రో రైల్ సర్వీసులు

గత ఏడాది నవంబర్‌ 28న అమీర్‌పేట-మియాపూర్‌, అమీర్‌ పేట-నాగోల్‌ కారిడార్లలో హైదరాబాద్‌ మెట్రో రైల్ సేవలు ప్రారంభం అయ్యాయి. ఆ తరువాత సెప్టెంబరు 24 నుంచి అమీర్‌పేట-ఎల్‌బీనగర్‌ కారిడార్‌లో కూడా ప్రారంభం అయ్యాయి. అప్పటి నుంచి ఆ మూడు మార్గాలలో మెట్రో రైళ్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిరాటంకంగా పరుగులు తీస్తున్నాయి.

ఈ నెలాఖరులోగా అమీర్‌పేట నుంచి హైటెక్‌ సిటీ వరకు మెట్రో సేవలు ప్రారంభించేందుకు మెట్రో అధికారులు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. గత నెల 29వ తేదీ నుంచి ఈ మార్గంలో ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు. అవి సంతృప్తికరంగా సాగుతుండటంతో త్వరలోనే కేంద్ర రైల్వేశాఖ పరిధిలోని కమిషనర్‌ ఆఫ్‌ మెట్రో రైల్‌ సేప్టీ (సీఎంఆర్‌ఎస్‌) ఉన్నతాధికారులు నగరానికి రానున్నారు. వారు సుమారు వారం రోజుల పాటు రోజూ వాటిలో ప్రయాణించి పరీక్షిస్తారు. అయితే ఇప్పటికే ట్రయల్ రన్స్ విజయవంతంగా పూర్తయ్యాయి కనుక సీఎంఆర్‌ఎస్‌ పరీక్షించి, అనుమతులు మంజూరు చేయడం లాంఛనప్రాయమేనని భావించవచ్చు.

బహుశః ఈనెల 25లోగా వారు ఆ లాంచనాలు పూర్తి చేసే అవకాశం ఉంది కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే అమీర్‌పేట-హైటెక్‌ సిటీ మెట్రో సేవలు ప్రారంభమైపోతాయి. డిసెంబరు నెలాఖరులోగా ఈ మార్గంలో మెట్రో సేవలు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని మెట్రో అధికారులు చెపుతున్నారు. ఈ మార్గంలో మెట్రో సేవలు ప్రారంభం అయితే, హైటెక్ సిటీలో ఉద్యోగాలు చేస్తూ రోజూ ట్రాఫిక్ లో నరకయాతన అనుభవిస్తున్న ఐ‌టి ఉద్యోగులకు చాలా ఉపశమనం లభిస్తుంది. 

10 కి.మీ పొడవున్న అమీర్‌పేట-హైటెక్‌ సిటీ కారిడార్‌లో అమీర్‌పేట-మధురానగర్-యూసఫ్ గూడ-జూబ్లీ హిల్స్ రోడ్ నెం:5- జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్-పెద్దమ్మ గుడి-మాధాపూర్-దుర్గం చెరువు-హైటెక్‌ సిటీ-సైబర్ గెట్ వే-రాయదుర్గ్ స్టేషన్లు ఉంటాయి.