కేసీఆర్‌ ప్లాన్ ఏమిటో?

దేశంలో కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ఒక ఫ్రంట్ ఏర్పాటుచేసి జాతీయరాజకీయాలలో చక్రం తిప్పుతానని   తెలంగాణ సిఎం కేసీఆర్‌ పదేపదే చెప్పినా చాలామంది నమ్మలేదు. కారణాలు కళ్ళకు కనిపిస్తున్నాయి. ఆయనకు ప్రధాని నరేంద్రమోడీతో గల స్నేహం కారణంగా జాతీయస్థాయిలో మోడీకి, బిజెపికి నష్టం కలిగించే ఏ పనిచేయరని భావించడం సహజం. అలాగే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం అయన కలిసిన నేతలు అందరూ కాంగ్రెస్ పార్టీ గొడుగు క్రిందకు చేరుకొంటున్నారు. కనుక ఈ పరిస్థితులలో కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ఫ్రంట్ ఏర్పాటు చేయడం అసాధ్యంగానే కనిపిస్తోంది. కనుక కేసీఆర్‌ మాటలను ఎవరూ నమ్మలేకపోతున్నారు. కానీ శాసనసభ ఎన్నికల తరువాత కూడా కేసీఆర్‌ జాతీయరాజకీయాలలోకి ప్రవేశించబోతునట్లు పునరుద్ఘాటించడంతో ఆయన మాటలు నమ్మక తప్పడంలేదు.

అయితే కేవలం 16 మంది ఎంపీలతో జాతీయ రాజకీయాలను, కేంద్ర ప్రభుత్వాన్ని ఏవిధంగా కేసీఆర్‌ శాసించాలనుకొంటున్నారు? అని ఆలోచిస్తే, ఇటీవల ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలలో సమాధానాలు కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జోక్యం చేసుకొంటామని ప్రకటించారు కనుక జగన్‌కు మద్దతు ఇస్తారని అర్దమవుతోంది. కేసీఆర్‌, తెరాస సహాయసహకారాలు మద్దతుతో జగన్మోహన్ రెడ్డి ఏపీలో గల 25 లోక్‌సభ సీట్లలో కనీసం 15-20 గెలుచుకోగలిగినా వాటితో కలిపి కేసి చేతిలో కనీసం 30-36 మంది ఎంపీలు ఉంటారు.

ఇక మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సహకారంతో యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్ తదితర ఉత్తరాది రాష్ట్రాలలో ముస్లింలను ఏకం చేసి కేసీఆర్‌ ఏర్పాటు చేయబోయే నేషనల్ ఫ్రంట్ వైపు ఆకర్షించగలిగితే ఆ రాష్ట్రాలలో అనేక ఎంపీ సీట్లు లభించే అవకాశం ఉంది. ఇక ఏనాటికైనా దేశప్రధాని కావాలని కలలుకంటున్న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మమతా బెనర్జీ, ములాయం సింగ్ యాదవ్ వంటివారిని నేషనల్ ఫ్రంట్ వైపు ఆకర్షించగలిగితే అప్పుడు కేసీఆర్‌ చెపుతున్నట్లుగా కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా నిలబడవచ్చు.

కానీ వచ్చే లోక్‌సభ ఎన్నికలలో మళ్ళీ విజయం సాధించి అధికారం నిలబెట్టుకోవాలని భావిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, ఆయనను గద్దె దించి ప్రధానమంత్రిలో కూర్చోవాలని తహతహలాడుతున్న రాహుల్ గాంధీ, తమ కలలను భగ్నం చేయడానికి కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తుంటే చేతులు ముడుచుకొని కూర్చోరు కనుక కేసీఆర్‌ ప్రయత్నాలకు ఉత్తరాది రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రప్రతిఘటన, అవరోధాలు ఎదుర్కోవలసి రావచ్చు. వాటిని కేసీఆర్‌ అండ్ కో అధిగమించగలిగితే ఇక ఆయనకు తిరుగు ఉండదు.