ప్రశ్నించే గొంతుని బ్రతికించండి: పొన్నం

అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి షాక్ నుంచి ఇప్పుడిప్పుడే మెల్లగా తేరుకొంటున్న కాంగ్రెస్‌ నేతలు ఒకరొకరుగా మళ్ళీ మీడియా ముందుకు వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్‌ నియంతృత్వ పాలన చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రజలు ఆయన మాయమాటలు నమ్మి మళ్ళీ తెరాసనే గెలిపించారు. ప్రజాభిప్రాయాన్ని, వారి తీర్పును తప్పుపట్టలేము. అయితే నిరంకుశపాలన సాగిస్తున్న కేసీఆర్‌ను ప్రశ్నించేవారు ఉండటం కూడా చాలా అవసరం. ప్రశ్నించేవారు లేకపోతే ఆయన పాలన ఏకపక్షంగా మరింత నిరంకుశంగా సాగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా పనిచేయాలంటే దానిని గట్టిగా నిలదీసి ప్రశ్నించేవారుండాలి. కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఆ ధైర్యం ఉంది కనుక త్వరలో జరుగబోయే మండల, జిల్లా స్థాయి ఎన్నికలు మొదలు లోక్‌సభ ఎన్నికల వరకు అన్నిటిలో కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి  చేస్తున్నాను. కాంగ్రెస్  పార్టీని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను. శాసనసభ ఎన్నికల ఫలితాలను చూసి కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎవరూ నిరాశా నిస్పృహలకు లోనవసరం లేదు. తక్షణం గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పార్టీ నేతలు, కార్యకర్తలు సమావేశాలు నిర్వహించుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 

తెరాస-బిజెపి బందం గురించి మాట్లాడుతూ, “బిజెపి తమ రాజకీయ శత్రువు అని కేసీఆర్‌ పైకి చెపుతున్నప్పటికీ ఆయన ఎప్పటికీ మోడీకి విధేయుడుగానే ఉంటారు. కరీంనగర్ లో బిజెపి ఎన్నికల ప్రచారసభకు మొదట అనుమతి నిరాకరించి, మళ్ళీ సాయంత్రానికల్లా అనుమతి మంజూరు చేసినపుడే తెరాస-బిజెపి బందం తేటతెల్లమైంది. కనుక తెరాస ఎప్పటికీ బిజెపికి తోకపార్టీగానే ఉంటుంది. ఈ ఎన్నికలలో డిపాజిట్లు కోల్పోయిన బిజెపి లోక్‌సభ ఎన్నికలలో ఏమి చేయాలనుకొంటోంది? చెపితే బాగుంటుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌, రాహుల్ గాంధీ ప్రభంజనం వీస్తోంది. కనుక వచ్చే లోక్‌సభ ఎన్నికలలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం,” అని పొన్నం ప్రభాకర్ అన్నారు.