నేడు కేసీఆర్‌ ఒక్కరే ప్రమాణస్వీకారం?

తెరాస శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన కేసీఆర్‌ నిన్న మీడియాతో మాట్లాడుతూ, “రేపు మాలో ఒకరిద్దరం మాత్రమే ప్రమాణస్వీకారం చేస్తాము. మంత్రివర్గం ఏర్పాటులో తొందరపాటు మంచిది కాదు కనుక దాని గురించి పార్టీలో చర్చించుకొని 5 రోజులు తరువాత మంత్రుల పేర్లు నిర్ణయించుకొన్నాక వారు కూడా ప్రమాణస్వీకారం చేస్తారు,” అని అన్నారు. 

కనుక ఈరోజు మధ్యాహ్నం 1.25 గంటలకు సిఎం కేసీఆర్‌ ఒక్కరే లేదా ఆయనతోపాటు మరొకరు ప్రమాణస్వీకారం చేస్తారు. ఒకవేళ మరొకరికి నేడు అవకాశం ఇవ్వదలిస్తే మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ లేదా ధర్మపురి శాసనసభ్యుడు  కొప్పుల ఈశ్వర్‌లలో ఎవరో ఒకరు ప్రమాణస్వీకారం చేసే అవకాశమున్నట్లు సమాచారం. 

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల పేర్లను అధికారికంగా దృవీకరిస్తూ బుదవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తరువాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ తో సహా మంత్రులు అందరూ తమ పదవులకు రాజీనామాలు చేసి వాటిని గవర్నరుకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో గవర్నరును కలిసిన తెరాస ఎమ్మేల్యేలు తమ పార్టీ 88 సీట్లు గెలుచుకొన్నందున  ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీని ఆహ్వానించవలసిందిగా గవర్నరును కోరారు. అందుకు ఆయన అంగీకరించడంతో  రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. కేసీఆర్‌ నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి రాజ్‌భవన్‌లో అవసరమైన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.