తెరాసకు 100, ప్రజాకూటమికి 75 సీట్లు పక్కా!

అవును. రాష్ట్రంలో ఉన్నవి మొత్తం 119 నియోజకవర్గాలే. కానీ తెరాసకు 100కు పైగా సీట్లు, ప్రజాకూటమికి 75-80 సీట్లు రాబోతున్నాయిట.

తెరాస నేత కేటిఆర్‌ తదితరులు నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “గత నాలుగేళ్లలో మా ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి పనులు, అమలుచేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలలో లబ్దిపొందినవారు మళ్ళీ మా పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకొనేందుకు పోలింగ్‌ బూత్‌లకు తరలివచ్చారు. అందుకే ఈసారి గణనీయంగా పోలింగ్ శాతం పెరిగింది. జిల్లాల నుంచి మాకు అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి 100కు పైగా స్థానాలను మేము గెలుచుకోబోతున్నాము,” అని అన్నారు. 

గోల్కొండ హోటల్‌లో ప్రజాకూటమి నేతలు, మంద కృష్ణమాదిగ తదితరులు నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. వారిలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “ఈఎన్నికలలో ప్రజాకూటమి 75-80 సీట్లు గెలుచుకోబోతోంది. కనుక డిసెంబరు 11 లేదా 12న నేను గడ్డం గీయించుకొంటాను. ఆ తరువాత మా ప్రభుత్వం ప్రమాణస్వీకారోత్సవానికి ప్రజాకూటమి సిద్దం అవుతుంది. తెరాసకు 30 కంటే ఎక్కువ స్థానాలకే పరిమితం అవుతుంది. తెలంగాణలోనే కాకుండా మిగిలిన 4 రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రాబోతోంది. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాది జరుగబోయే లోక్ సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ వంటివి కనుక వాటి తరువాత కేంద్రంలో కూడా కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం ఖాయం,” అని అన్నారు. 

ఇక ఈ ఎన్నికలలో 119 స్థానాలకు పోటీ చేసిన బిజెపి ఎన్నికల ప్రచార సమయంలోనే రాష్ట్రంలో ‘హంగ్ అసెంబ్లీ ఏర్పడబోతోందంటూ’ మొదట్లోనే చేతులెత్తేసి తమ ఓటమిని అంగీకరించగా, పోలింగ్ ప్రక్రియ పూర్తవగానే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెరాస గెలిచే అవకాశాలున్నాయని ఒప్పుకొని తమ బిఎల్ఎఫ్ ఓటమిని అంగీకరించారు. కనుక ఇక తెరాస, ప్రజాకూటమిలో దేనికి ఎన్ని సీట్లు వస్తాయనేది తెలియాల్సి ఉంది.