తెరాసను గెలిపించడానికా...ఓడించడానికి వచ్చారా?

ఈనెల 7వ తేదీన జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో 119 నియోజకవర్గాలలో కలిపి మొత్తం 73.2 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. 2014 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి 3.70 శాతం పెరిగిందని తెలిపారు. 

ఈసారి పోలింగ్ శాతం పెరగడానికి తెరాస, ప్రజాకూటమి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కారణంగా జనాలు మళ్ళీ తెరాసను గెలిపించుకొనేందుకే తండోపాతండాలుగా తరలివచ్చారని అందుకే ఈసారి పోలింగ్ శాతం గణనీయంగా పెరిగిందని తెరాస నేతలు చెప్పుకొంటున్నారు. 

 అయితే కాంగ్రెస్ నేతల వాదన మరోలా ఉంది. కేసీఆర్‌ నిరంకుశపాలనను అంతమొందించాలనే కసితో భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారని అందుకే ఈసారి పోలింగ్ శాతం పెరిగిందని కాంగ్రెస్‌ నేతలు చెప్పుకొంటున్నారు.

అయితే పోలింగ్ శాతం పెరగడం వలన తెరాస, ప్రజా కూటమిలో దీనికి లాభం అని ఆలోచించినట్లయితే తెరాసకే లాభం కలుగవచ్చునని చెప్పవచ్చు. ఏవిధంగా అంటే, ఈసారి పట్టణ ప్రాంతాలలో కంటే గ్రామీణ ప్రాంతాలలోనే పోలింగ్ శాతం చాలా ఎక్కువగా ఉంది. గ్రామీణప్రజలలో ఇంచుమించు ప్రతీ ఒక్కరూ రైతుబంధు, రైతు భీమా, వ్యవసాయానికి ఉచిత కరెంటు, కంటివెలుగు, కేసీఆర్ కిట్స్, పెన్షన్లు వంటి 400కు పైగా ఉన్న సంక్షేమ పధకాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పధకాలలో తప్పక లబ్ధిపొంది ఉంటారు. కనుక వారందరూ ఈసారి  భారీ సంఖ్యలో తరలివచ్చి ఓట్లు వేశారంటే దానర్ధం వారు తెరాసకే ఓట్లు వేసి ఉండవచ్చునని భావించవచ్చు. కనుక పోలింగ్ శాతం పెరిగినందున తెరాసకే లబ్ధి కలుగవచ్చు.   

ఓటర్లు తెరాసను మళ్ళీ గెలిపించడానికే భారీగా తరలివచ్చారా లేక ఓడించడానికే వచ్చారా? అనేది ఎల్లుండి ఎలాగూ తేలిపోతుంది. ఓటర్లు ఏ కారణంతో వచ్చినప్పటికీ పోలింగ్ శాతం పెరగడం వలన తెరాస, ప్రజాకూటమిలలో దేనికో ఒకదానికి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్ని సీట్లు లభించే అవకాశం ఉంటుంది కనుక రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే ప్రమాదం తప్పినట్లే భావించవచ్చు.