ఒంటి గంటకు 49% పోలింగయితే 5 గంటలకు?

రాష్ట్రంలో 3 నెలలపాటు ఏకధాటిగా జరిగిన ఎన్నికల ప్రచారంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండు పూర్తి భిన్నమైన వాదనలు వినిపించడంతో అలవోకగా సాగిపోవలసిన ఈ ఎన్నికలు కూడా చాలా సంక్లిష్టమైనవిగా మారిపోయాయి. ఆ కారణంగా వాటివాదనలపై తమ నిర్ణయం తెలియజేయడానికి ఈసారి భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓపికగా నిలబడి ఓట్లు వేస్తున్నారు. దాంతో రాష్ట్రంలో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. మధ్యాహ్నం ఒంటి గంటకు సుమారు 48.5 శాతం వరకు పోలింగ్ నమోదు అయ్యింది. కనుక ఇదేవిధంగా పోలింగ్ కొనసాగితే సాయంత్రం 5గంటలకు పోలింగ్ ముగిసేసరికి కనీసం 85-90 శాతం వరకు పోలింగ్ జరిగే అవకాశాలుంటాయని భావించవచ్చు. 

ఈరోజు జరుగుతున్న ఈ ఎన్నికలు నాలుగేళ్ళ తెరాస పాలనపై రిఫరెండంగా భావించవచ్చు. అలాగే తెలంగాణతో పాటు ఒకేసారి 4 బిజెపి పాలిత రాష్ట్రాలలో జరుగుతున్న ఈ ఎన్నికలు ప్రధాని నరేంద్రమోడీ పాలనకు కూడా రిఫరెండంగా భావించవచ్చు. కనుక 3 నెలల తరువాత జరుగబోయే లోక్ సభ ఎన్నికలకు వీటిని సెమీ ఫైనల్స్ గా భావించవచ్చు.