
నేడు తెలంగాణతో పాటు రాజస్థాన్ లో కూడా పోలింగ్ జరుగుతోంది. బిజెపి పాలిత రాజస్థాన్ లో మొత్తం 200 స్థానాలలో నేడు 199 స్థానాలకు పోలింగ్ మొదలైంది. ఆల్వార్ జిల్లాలోని రామ్‌గఢ్ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి అనారోగ్యంతో మృతి చెందడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 199 స్థానాలకు మొత్తం 2274 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. రాజస్తాన్ లో 4,77,89,815 మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 2.50 కోట్లు మంది, మహిళలు 2.28 కోట్లు, ట్రాన్స్ జెండర్స్ (నపుంసకులు) 222 మంది ఉన్నారు.
రాజస్తాన్ లో ఈసారి బిజెపికి ఎదురుగాలి వీస్తున్నట్లు సమాచారం. కనుక అధికారం నిలబెట్టుకోవడానికి బిజెపి, చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేశాయి. ఈరోజు సాయంత్రం పోలింగ్ పూర్తవగానే తెలంగాణతో సహా ఎన్నికలు జరిగిన మధ్య ప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం రాష్ట్రాలలో వివిద సర్వే సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెలువడతాయి కనుక ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందో కొంతవరకు తెలియవచ్చు. ఐదు రాష్ట్రాలలో డిసెంబరు11వ తేదీన ఓట్ల ల్క్కింపు చేసి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.