పోలింగ్ షురూ...ఈవీఎంలు మొరాయింపు

రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. అనేక ప్రాంతాలలో ఉదయం 6 గంటల నుంచే ఓటర్లు పోలింగు బూతుల వద్దకు చేరుకొని క్యూ కట్టడం విశేషం. వరంగల్ జిల్లాలో మొదటి గంటలోనే సుమారు 7శాతం పోలింగ్ జరిగిందటే ఈసారి ఎన్నికలపై ఓటర్లు కూడా ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. సినీ నటుడు నాగార్జున, హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుహాసిని, వేమూరి రాధాకృష్ణ, రేవంత్‌రెడ్డి, జీహెచ్ఎంసి కమీషనర్, దాన కిషోర్, ఐ‌టి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, తదితర ప్రముఖులు పోలింగ్ మొదలవగానే వచ్చి తమతమ నియోజకవర్గాలలో ఓటు హక్కుని వినియోగించుకొన్నారు.       

అయితే చాలా చోట్ల ఈవీఎంలు మొరాయిస్తుండటంతో ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖైరతాబాద్, జియాగూడ ఇందిరానగర్, కామారెడ్డి, అశ్వారావుపేట, ఆలేరులోని రాఘవాపురం, కాగజ్ నగర్ తదితర అనేక చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభం అయ్యింది. వీలైనవాటికి మరమత్తులు చేసి సాధ్యం కాకపోతే వాటి స్థానంలో  వేరే ఈవీఎంలను ఏర్పాటు చేసి పోలింగ్ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.