తెలంగాణ ఓటర్లకు ముఖ్య గమనిక

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది సేపటి క్రితమే పోలింగ్ మొదలైంది. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఓటర్లు అందరికీ ఇప్పటికే ఓటరు స్లిప్పులు చేతికి వచ్చాయి. కానీ ఏ కారణం చేతైనా ఓటరు స్లిప్పు అందకపోయినా లేదా ఓటరు కార్డు లేకపోయినా లేదా ఆ రెండూ కూడా లేకపోయినా ఏవిధంగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చునో ఎన్నికల సంఘం వివరించింది. 

1. ఒకవేళ ఓటరు స్లిప్పు, ఓటరు కార్డు లేకపోయినా ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్ పోర్ట్ మొదలైన 12 రకాల ఆధారాలలో ఏది చూపించినా ఓటు వేయవచ్చు.

2. ఓటరు స్లిప్పు లభించకపోయుంటే www.ceotelangana.nic.in ద్వారా లేదా MyGHMC మొబైల్ యాప్‌ ద్వారా ఓటరు స్లిప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

3. వీవీప్యాట్‌ నుంచి వచ్చే రశీదు ద్వారా మీరు ఎంచుకొన్న అభ్యర్ధికే మీ ఓటు పడిందో లేదో నిర్ధారణ చేసుకోవచ్చు. ఒకవేళ వేరెవరికైనా పడినట్లు రశీదులో చూపిస్తే వెంటనే ప్రిసైడింగ్‌ అధికారికి ఫిర్యాదు చేయాలి. 

4. మీ ఓటును వెరవరైనా వేసినట్లు గమనిస్తే ప్రిసైడింగ్‌ అధికారికి ఫిర్యాదు చేసినట్లయితే, వారు మీ పిర్యాదును నమోదు చేసుకొని బ్యాలెట్ పేపరు ద్వారా మళ్ళీ ఓటువేసే అవకాశం కల్పిస్తారు.     

5. మద్యం త్రాగి ఓటు వేయడానికి వెళ్లరాదు. అన్ని పోలింగ్ బూతుల వద్ద ఈసారి బ్రీత్ అనలైజర్లు ఏర్పాటు చేశారు.    

6. సెల్ ఫోన్లు, ల్యాప్ టాపులు, పెన్ కెమెరాలు మొదలైనవాటిని పోలింగ్ కేంద్రాలలోకి అనుమతించరు.

7. పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణలకు పాల్పడితే కటిన చర్యలు ఉంటాయి.

8. పోలింగ్ కేంద్రంలో ఏవైనా అవకతవకలు జరుగుతునట్లు అనుమానం కలిగినా లేదా అభ్యర్ధులు వారి పోలింగ్ ఏజంట్లు ఓటర్లపై లేదా ప్రిసైడింగ్ అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు గమనించినా ఓటర్లు cVIGIL అనే మొబైల్ యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లయితే తక్షణమే చర్యలు తీసుకొంటుంది.