అప్పుడు భగీరధ.. ఇప్పుడు గట్టు ఎత్తిపోతల!

మిషన్ భగీరధ పధకం ద్వారా ఇంటింటికీ నీళ్ళు ఇవ్వలేకపోతే ఈసారి ప్రజలను ఓట్లు అడగబోమని సిఎం కేసీఆర్‌ శపధం చేయగా దేశంలో మరే ముఖ్యమంత్రి కేసీఆర్‌లాగ అంత ధైర్యంగా చెప్పలేరని, ఒక్క కేసీఆర్‌కు మాత్రమే అది సాధ్యమని గత నాలుగేళ్ళుగా తెరాస నేతలు ఆ శపధం గురించి చాలా గొప్పగా చెప్పుకొన్నారు. కానీ మిషన్ భగీరధ పూర్తికాలేదు. కానీ 9 నెలలు ముందుగా ఎన్నికలకు వెళ్ళి ప్రజలను ఓట్లు అడుగుతున్నారిప్పుడు. కనుక సహజంగానే ఆ శపధం గురించి ప్రతిపక్షపార్టీలు కేసీఆర్‌కు గుర్తు చేసి ఇంటింటికీ నీళ్ళు ఇవ్వనిదే ఓట్లు అడగనని చెప్పి 9 నెలలు ముందుగానే ఎందుకు ఓట్లు అడుగుతున్నావంటూ ప్రశ్నిస్తున్నాయి. దానికి కేసీఆర్‌ సమాధానం చెప్పలేదు కానీ మంగళవారం గజ్వేల్ లో నిర్వహించిన బహిరంగసభలో తాజాగా గట్టు ఎత్తిపోతల పధకం పూర్తిచేయకపోతే వచ్చే ఎన్నికలలో ఓట్లు అడగబోనని సిఎం కేసీఆర్ ప్రకటించారు. ఈసారి అధికారంలోకి రాగానే గట్టు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 40 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని సిఎం కేసీఆర్‌ ప్రకటించారు.