నేనే సిఎం అవుతా: సర్వే

ఈ ఎన్నికలలో గెలిచి ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారని తెరాస ప్రశ్నిస్తోంది. దానికి కాంగ్రెస్‌ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ సమాధానం చెప్పారు. ఈసారి సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నా మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ, ప్రజాకూటమి అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రి అవుతానని చెప్పారు. మంగళవారం ఆయన తన తన నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తున్నపుడు, ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “గత ఎన్నికలలో తెరాస గెలిచి అధికారంలో వస్తే దళితుడిని సిఎం చేస్తానని చెప్పిన కేసీఆర్‌ ఆ కుర్చీలో తానే కూర్చొని దళితులను మోసం చేశాడు. కనుక ఈసారి దళితులకు ఆ అవకాశం కల్పించాలని మా పార్టీ అధిష్టానం భావించినట్లయితే దళితుడినైనా నేనే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఏవైనా కారణాల చేత నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేకపోయినా మంత్రిపదవి ఇవ్వడం ఖాయం. కనుక నన్ను భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నాను,” అని చెప్పారు. 

కొన్ని రోజుల క్రితం సర్వే సత్యనారాయణ కూకట్‌పల్లి అభ్యర్ధి సుహాసిని తరపున ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఆమె గెలిస్తే మంత్రిపదవి లభిస్తుందని ప్రకటించి కొత్త చర్చకు తెర తీశారు. ఇప్పుడు స్వయంగా తానే సిఎం లేదా మంత్రి పదవి చేపట్టబోతున్నానని సర్వే సత్యనారాయణ ప్రకటించుకొన్నారు. 

అయితే కాంగ్రెస్ పార్టీలో డజనుకు పైగా ముఖ్యమంత్రి అభ్యర్ధులు ఉన్నారనే సంగతి అందరికీ తెలిసిందే. కనుక సర్వే ఈవిధంగా చెప్పుకోవడం పెద్ద విచిత్రమేమీ కాదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్ధుల పేర్లు ఖరారు చేయక మునుపే అనేకమంది సీనియర్లు తాము ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నామో ప్రకటించుకొన్నారు. అదేవిధంగా ఇప్పుడు మంత్రి పదవుల గురించి ప్రకటించుకొంటున్నారు అంతేనని సరిపెట్టుకోవాలేమో.