
రాష్ట్రంలో మూడు నెలలపాటు ఏకధాటిగా సాగిన ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం 5గంటలతో ముగియనుంది. ఆ తరువాత అభ్యర్ధులు లేదా వారి తరపున ఎవరూ ఎన్నికల ప్రచారం, సభలు, సమావేశాలు నిర్వహించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. సినిమాహళ్ళు, టీవీ ఛానల్స్, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా ఎటువంటి ప్రచార ప్రకటనలు ప్రసారం చేయరాదని చెప్పారు. పోలింగుకు 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయాలనే నిబందనను తూచా తప్పకుండా పాటిస్తామని ఎవరైనా ఉల్లంఘించినట్లు తెలిస్తే చట్ట ప్రకారం కటిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.
డిసెంబరు 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం వంటి సమస్యాత్మాక ప్రాంతాలలో మాత్రం పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని రజత్‌కుమార్ తెలిపారు. మొత్తం 32,815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఈసారి దివ్యాంగుల కోసం వేరేగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా ముగిసేందుకు అన్ని చర్యలు చేపట్టమని రజత్‌కుమార్ తెలిపారు.