కొడంగల్‌లో సంక్షేమ మంత్రాలు జపించిన కేసీఆర్‌

రాష్ట్రంలో సిఎం కేసీఆర్‌ను గట్టిగా సవాలు చేస్తున్నవారిలో రేవంత్‌రెడ్డి ఒకరు. ఆయనను ఈసారి ఎన్నికలలో ఎలాగైనా ఓడించాలని తెరాస పట్టుదలతో ఉంది. కనుక ఈరోజు కొడంగల్‌ నియోజకవర్గంలో కొస్గీలో సిఎం కేసీఆర్‌ నిర్వహించిన ప్రజాఆశీర్వాదసభలో రేవంత్‌రెడ్డిపై నిప్పులు చెరుగుతారని అందరూ భావించడం సహజం. కానీ సిఎం కేసీఆర్‌ తన సహజశైలికి పూర్తిభిన్నంగా గత నాలుగేళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించడానికే పరిమితం అయ్యారు. 

తెరాస అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డిను గెలిపించినట్లయితే, కొడంగల్‌ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు అయోమయంలో ఓటు వేస్తే మళ్ళీ ‘గాలిగాళ్ళు’ గెలుస్తారని, కనుక బాగా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 సీట్లు తెరాస గెలుచుకోబోతోందని కేసీఆర్‌ అన్నారు. మళ్ళీ తాను అధికారంలోకి రాగానే కొడంగల్‌ నియోజకవర్గం సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ తన ప్రసంగంలో రేవంత్‌రెడ్డి పేరును ఉచ్చరించకుండానే ముగించారు. 

రేవంత్‌రెడ్డి అరెస్టు కారణంగా కొడంగల్‌లో ఉద్రిక్తవాతావరణం నెలకొని ఉన్నందున, రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడినట్లయితే స్థానిక ప్రజలలో తెరాస పట్ల వ్యతిరేకత పెరగవచ్చుననే ఉద్దేశ్యంతోనే సిఎం కేసీఆర్‌ తన ప్రసంగంలో కొడంగల్‌ అభివృద్ధి, సంక్షేమ మంత్రాలు జపానికి పరిమితం అయ్యుండవచ్చు. కానీ కొడంగల్‌లో ఉద్రిక్తవాతావరణం నెలకొని ఉన్నప్పటికీ కేసీఆర్ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరవడం విశేషం. 

కేసీఆర్‌ సభపై రేవంత్‌రెడ్డి స్పందిస్తూ, “కేసీఆర్‌ నన్ను ఎదుర్కొనే ధైర్యం లేకనే వేలాదిమంది పోలీసులను మోహరించి, ముందస్తు అరెస్టులు చేసి, పోలీసు బందోబస్తు మద్య కొడంగల్‌లో సభ నిర్వహించి ఏదో ఘనకార్యం చేశానని భావిస్తున్నట్లున్నారు. కానీ ఈరోజు జరిగిన పరిణామాలే తెరాస ఓటమికి కారణం కాబోతున్నాయని గ్రహిస్తే మంచిది,” అని అన్నారు.