
ప్రముఖ నటుడు, హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సోమవారం గడ్డి అన్నారంలో ప్రజాకూటమి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ సిఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. “తెలంగాణ రాజకీయాలలో చంద్రబాబు నాయుడు వేలు పెడుతున్నారు కనుక మేము కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేలుపెడతాము. చంద్రబాబును రాజకీయంగా అంతం చేస్తాం,” అంటూ మంత్రి కేటిఆర్ చేసిన హెచ్చరికలపై బాలకృష్ణ తీవ్రంగా స్పందిస్తూ, “కేసీఆర్‌ది లాటరీ అదే.. చంద్రబాబునాయుడుది హిస్టరీ. కేసీఆర్ లాగా చంద్రబాబు ఫాంహౌసులో పడుకోరు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటారు. ఈ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు తరిమికొడితే కేసీఆర్ కుటుంబం ఎలాగూ రాష్ట్రం విడిచి పారిపోకతప్పదు. అప్పుడు ఆంధ్రాకే కాదు...వారు ఎక్కడికీ రాలేరు. అయినా కేసీఆర్, కేటిఆర్‌లకు నిజంగా అంత దమ్ము ధైర్యం ఉంటే ఏపీలో వేలు పెట్టి చూడండి... ఏమవుతుందో మీకే తెలుస్తుంది. దమ్ముంటే ఏపీకి రండి చూసుకొందాం,” అని సవాలు విసిరారు.
ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఇటువంటి సవాలు విసురుతున్న బాలకృష్ణ గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు తన స్వంతపని మీద సిఎం కేసీఆర్‌ను కలిసి ఫోటోలు కూడా దిగారు. గత నాలుగేళ్ళలో సిఎం కేసీఆర్ బాలకృష్ణ గురించి ఒక్కసారి కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు పైగా ఏదో ఒక పని మీద కేసీఆర్‌ను కలుస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఈవిధంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే ఎన్నికల ప్రచారంలో ఆంధ్రా ఓటర్లను ఆకట్టుకోవడానికేనని చెప్పవచ్చు. బహుశః చంద్రబాబునాయుడు ప్రోత్సాహంతోనే ఆయన అంత ధైర్యంగా కేసీఆర్‌కు సవాలు విసురుతున్నారనుకోవచ్చు. కానీ ఎన్నికల తరువాత కూడా బాలకృష్ణ కేసీఆర్‌తో ఇదే వైఖరితో వ్యవహరిస్తారా? అంటే అనుమానమే.
ఈ ఎన్నికలలో తెరాస, ప్రజాకూటమిలో ఏది గెలిచినప్పటికీ, ఇకపై తెరాస తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేలు పెట్టడం ఖాయమని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డిలకు అవసరమైన సహాయసహకారాలు అందించడం ద్వారా చంద్రబాబునాయుడుపై రాజకీయ ప్రతీకారం తీర్చుకొనే ప్రయత్నం చేయవచ్చు. అదే కనుక జరిగితే వారిలో పవన్ కళ్యాణ్ తెరాస ఆఫర్ ను తిరస్కరించవచ్చు కానీ జగన్ మాత్రం చాలా సంతోషంగా స్వీకరించడం ఖాయం.