మద్యంతాగి.. డ్రైవింగ్ చెయ్యడం వల్ల చిన్నారి రమ్య ప్రాణాలు ప్రమాదవశాత్తు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో తెలంగాణ సర్కార్ దీనిపై సీరియస్ గా స్పందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన రమ్య చావుతో సర్కార్ కన్నెర్రజేసింది. ఇంజినీరింగ్ విద్యార్థులు బంజారాహిల్స్‌లో పట్టపగలే మద్యం మత్తులో కారును ప్రమాదకరంగా నడిపి రమ్య ప్రాణాలు తీశారు. కారులో ఉన్న విద్యార్థులందరూ 20 ఏండ్ల లోపువారేనని వెల్లడైంది. దాంతో ప్రభుత్వం ఆ మైనర్లపై, వారికి మద్యం అమ్మిన వారిపైనా కేసులు నమోదు చేసింది.
నిబంధనలకు విరుద్ధంగా మైనర్లకు మద్యం సరఫరా చేసి బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన టీజీఐఎఫ్ బార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ సినిమాక్స్ బిల్డింగ్‌లోని టీజీఐఎఫ్ బార్‌కు వచ్చిన ష్రోవెల్ , విష్ణు, సాయి రామన్, అలన్ జోసెఫ్, అశ్విన్ శరణ్, నేతి సూర్య అనే ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మద్యం తాగారు. మద్యం మత్తులో కారు నడిపిన ష్రోవెల్ తొలుత డివైడర్‌ను డీకొట్టి, ఆ తరువాత ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టడంతో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పమ్మి రాజేశ్ అక్కడికక్కడే మృతి చెందగా తొమ్మిది రోజుల పాటు మృత్యువుతో పోరాడిన రమ్య కూడా కన్నుమూసింది. మైనర్లకు మద్యం సరఫరా చేయడం వల్లే ప్రమాదం జరిగిందని, వారికి మద్యం సరఫరా చేసిన బార్ యజమానులపై చర్యలు తీసుకోవాలని రమ్య తల్లి రాధిక ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు టీజీఐఎఫ్‌పై ఎక్సైజ్ చట్టం సెక్షన్ 36(1),(జీ) కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.