
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ ప్రధానంగా తెరాస-ప్రజాకూటమిల మద్యే ఉన్నప్పటికీ, రాష్ట్ర, కేంద్ర బిజెపి అగ్రనేతలు, కేంద్రమంత్రులు చాలా జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బిజెపి బహిరంగసభలో పాల్గొనడానికి హైదరాబాద్ వస్తున్నారు. కనుక బిజెపి నేతలు సభకు కావలసిన ఏర్పాట్లు చురుకుగా చేస్తున్నారు.
ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడి నుంచి నేరుగా సభాస్థలికి చేరుకొంటారు. ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగసభ సాయంత్రం 4 గంటల నుంచి సుమారు గంటసేపు సాగవచ్చని సమాచారం. ఆయనతో పాటు పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్ర నేతలు ఈరోజు బహిరంగసభలో పాల్గొంటారు. ఇక ఇప్పటికే హైదరాబాద్లో టిడిపి, కాంగ్రెస్, బిజెపి, తెరాసలకు చెందిన పలువురు ప్రముఖులు రోడ్ షోలు బహిరంగసభలు నిర్వహిస్తున్నారు కనుక పోలీసులు ఆయా ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
బిజెపికి ఈ సభ చాలా కీలకమని చెప్పవచ్చు. ఏవిధంగా అంటే, ఈ సభతో ఒక్క హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలపై మాత్రమే కాకుండా, వాటిని ఆనుకొని చుట్టుపక్కల గల కంటోన్మెంట్, నాంపల్లి, ఛార్మినార్, చాంద్రాయణగుట్ట, గోషామహల్, మలక్ పేట, ఉప్పల్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, అంబర్ పేట, సనత్ నగర్, మల్కాజ్ గిరీ, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీ నగర్, రాజేందర్ నగర్, బహదూర్ పురా, యాకత్ పురా, కార్వాన్ ఇబ్రహీంపట్నం, పటాన్ చెరు వంటి అనేక నియోజకవర్గాలపై ప్రధాని నరేంద్రమోడీ ప్రభావం చూపగల అవకాశం ఉంటుంది.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ (ముషీరాబాద్), సీనియర్ నేతలు కిషన్ రెడ్డి (అంబర్ పేట), రాజాసింగ్ (గోషామహల్), ఎన్.వివిఎస్ ప్రభాకర్ (ఉప్పల్), సిహెచ్ రామచంద్రారెడ్డి (ఖైరతాబాద్), ఎన్.రామచంద్రరావు (మల్కాజ్ గిరీ) పి.శేఖర్ (ఎల్బీ నగర్), భవర్ లాల్ వర్మ (సనత్ నగర్) పోటీ చేస్తున్నారు. ఆ నియోజకవర్గాలలో తెరాస, కాంగ్రెస్, టిడిపి పార్టీలు చాలా బలమైన అభ్యర్ధులను బరిలో దించాయి. కనుక ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ సభ బిజెపి అభ్యర్డుల విజయావకాశాలను ఏ మేరకు మెరుగుపరుస్తుందో చూడాలి.